బోనం అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు?
తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.
బోనం అంటే దేవతలకు సమర్పించే నైవేద్యం. ‘బోనం’ అనే పదానికి భోజనం అనే అర్థం ఉంది. సాధారణంగా మట్టి కుండలో కొత్త బియ్యం, పాలు, బెల్లం, నీటితో వండిన అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
తయారు చేసిన బోనాన్ని పసుపు, కుంకుమ, వేపకొమ్మలు, పూలతో అందంగా అలంకరిస్తారు. ఒక్కో ప్రాంతంలో, ఒక్కో దేవతకు భిన్నమైన విధానాల్లో బోనం తయారు చేస్తారు.
బోనాల పండుగలో పోతరాజుల ఆటలు, డప్పుల మోతలు, అమ్మవారి ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగను ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.