New-pensions: ఆగస్ట్ 15 నుంచి కొత్త పింఛన్లు.. తెలంగాణలో లక్షల మందికి సీతక్క గుడ్ న్యూస్!

తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఆగస్ట్ 15 (స్వాతంత్ర్య దినోత్సవం) నుంచి పింఛన్లు అందజేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులకు ఈ విడతలో కొత్త పెన్షన్లు అందనున్నాయి.

ములుగు జిల్లా పర్యటనలో మాట్లాడిన మంత్రి సీతక్క.. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, కుటుంబ ఆధారం లేని ఒంటరి మహిళలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆమె హామీ ఇచ్చారు.

క్షేత్రస్థాయి పరిశీలన.. పారదర్శకంగా ఎంపిక:
కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు

నిజమైన అర్హులకే పెన్షన్: దరఖాస్తుదారుల వివరాలను అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి స్వయంగా పరిశీలించాలి. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా కేవలం అర్హత ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయాలి.

అనర్హుల ఏరివేత: ప్రస్తుతం పింఛన్ పొందుతూ.. ఇప్పటికే మరణించిన వారి పేర్లను తక్షణమే జాబితా నుండి తొలగించాలి. దీనివల్ల మిగిలే నిధులను కొత్తగా అర్హత సాధించిన వారికి కేటాయిస్తారు.

డిజిటల్ వెరిఫికేషన్: లబ్ధిదారుల ధృవీకరణ కోసం ప్రస్తుతం ‘లైవ్ అథెంటికేషన్’ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

3 లక్షల మందికి ప్రయోజనం!

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 నుండి 3 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే, ఆగస్ట్ 15వ తేదీ నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న ఒంటరి మహిళలు, వితంతువులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *