భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) మరోసారి ఐపీఎల్‌(IPL)తో అనుబంధం ఏర్పరుచుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఆయన ఆటగాడిగా కాకుండా కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే సీజన్ నుంచి దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్ సేవలందించే అవకాశం ఉందని తెలుస్తోంది.


క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్, కోచింగ్ రంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మేనేజ్‌మెంట్ కూడా అతడిని తమ సహాయక సిబ్బంది బృందంలోకి తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) మరోసారి దిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి పనిచేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. యువరాజ్ సింగ్‌ను జట్టులోకి తీసుకురావాలన్న ఆలోచన గంగూలీదేనని, ఆయన సూచన మేరకే దిల్లీ మేనేజ్‌మెంట్ అంగీకరించినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. యువరాజ్ కూడా దిల్లీ ఫ్రాంచైజీతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.


గత రెండు సీజన్లలో దిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు నిర్వహించిన గంగూలీ, జట్టు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. కొత్త సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులోనే కాకుండా సహాయక సిబ్బంది విభాగంలో కూడా మార్పులు చేయాలని దిల్లీ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ రాక జట్టుకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశముందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *