టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా, యువ దర్శకుడు శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’(Irumudi). ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాపై టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే, సినిమా విడుదలకు ముందే డిజిటల్ మార్కెట్‌లో ‘ఇరుముడి’ సెన్సేషన్ సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్(Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

దాదాపు రూ.14 కోట్లకు అటు ఇటుగా ఈ ఒప్పందం జరిగినట్లు సమాచారం. రవితేజ మార్కెట్‌తో పాటు దర్శకుడు శివ నిర్వాణ గత చిత్రాల ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకుని నెట్‌ఫ్లిక్స్ ఈ స్థాయి మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

వాస్తవానికి రవితేజకు కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు దక్కలేదు. ‘ధమాకా’ తర్వాత ఆయన నటించిన సినిమాలు థియేటర్లలో కమర్షియల్‌గా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. వరుస చిత్రాలు నిరాశపరిచినప్పటికీ, ‘ఇరుముడి’కి ఇంత భారీ డిజిటల్ డీల్ కుదరడం వెనుక సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకమే ప్రధాన కారణమని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *