దేశంలో పెట్రోల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు వాయు కాలుష్యాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో భారతదేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును అధికారికంగా ఆవిష్కరించారు. ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ అభివృద్ధి చేసిన వాగన్‌ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పరిచయం చేసింది. ఈ సాంకేతికత ద్వారా వాహనాలు పెట్రోల్‌పై పూర్తిగా ఆధారపడకుండా అధిక శాతం ఇథనాల్ ఇంధనంతో నడిచే సామర్థ్యాన్ని పొందాయి. దీంతో ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు చేకూరనుంది.

కేంద్ర మంత్రుల సమక్షంలో ఆవిష్కరణ


భారతదేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. దేశంలో ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ అంటే ఏమిటి?


మారుతి సుజుకి రూపొందించిన వాగన్‌ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనం E85 నుంచి E100 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేసే విధంగా అభివృద్ధి చేయబడింది. అంటే ఈ వాహనంలో 85 శాతం నుంచి 100 శాతం వరకు ఇథనాల్‌ను ఇంధనంగా ఉపయోగించవచ్చు.
సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈ టెక్నాలజీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
పెట్రోల్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది
ఇంధన వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది
కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది

ఇథనాల్ వినియోగానికి ప్రభుత్వ ప్రోత్సాహం


దేశంలో ఇథనాల్ ఆధారిత ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులో ఉంది. ఇందులో 20 శాతం ఇథనాల్ మిశ్రమంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇథనాల్ వినియోగాన్ని మరింత పెంచే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లు


ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కార్లకే పరిమితం కాకుండా ద్విచక్ర వాహనాల్లో కూడా విస్తరిస్తోంది. ఇటీవల హీరో మోటోకార్ప్ సంస్థ హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్-ఫ్యూయల్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లను మార్కెట్లో విడుదల చేసింది.

భవిష్యత్తు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలదేనా?


పెట్రోల్ ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వినియోగదారులకు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మారే అవకాశముంది. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల నియంత్రణ, ఇంధన దిగుమతుల తగ్గింపు వంటి లక్ష్యాల సాధనలో కూడా ఈ వాహనాలు కీలక పాత్ర పోషించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *