ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (లేపాక్షి) వినూత్నంగా ‘QR కోడ్ వ్యవస్థను’ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ప్రారంభించినట్లు సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ఈ కొత్త విధానంలో ప్రతి హస్తకళ ఉత్పత్తిపై ప్రత్యేకంగా ‘QR కోడ్’ ఉంటుంది. వినియోగదారులు ఆ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేస్తే ఆ కళాఖండానికి సంబంధించిన పూర్తి సమాచారం, దానిని రూపొందించిన కళాకారుడి వివరాలు, కళా విశేషాలు, తయారీ విధానం వంటి అంశాలు తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ వ్యవస్థలో బొనుమద్ది మురళి రూపొందించిన బొబ్బిలి ఏకండ వీణ, సి. సుబ్రహ్మణ్యం రూపొందించిన మహాభారతం, కృష్ణలీల, సంపూర్ణ రామాయణం నేపథ్యంలోని కలంకారి చిత్రాలు సహా పలు హస్తకళా ఉత్పత్తులను చేర్చారు. ఈ QR కోడ్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించడంతో పాటు, కళాకారులకు అంతర్జాతీయ మార్కెట్‌లో అవకాశాలు పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
