నగదు మార్పిడి పేరుతో విశాఖపట్నంలో భారీ మోసం, దోపిడీ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బును డాలర్లుగా మార్చి ఇస్తామంటూ నమ్మించిన దుండగులు ముగ్గురు బాధితులపై దాడి చేసి రూ.68 లక్షల నగదు, 10 తులాల బంగారం అపహరించుకెళ్లారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.
ఆన్‌లైన్ పరిచయంతో మోసానికి తెర
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేశ్‌కు ఆన్‌లైన్‌లో రాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. నగదు ఇస్తే దాన్ని డాలర్లుగా మార్చి ఇస్తామని రాజు రమేశ్‌ను నమ్మించినట్లు తెలుస్తోంది.
ఈ మాటలు నమ్మిన రమేశ్ తన స్నేహితుడితో కలిసి నగదు మార్పిడి కోసం విశాఖపట్నం వచ్చారు.
డైమండ్ పార్కు వద్ద దాడి
నగదు మార్పిడి కోసం రమేశ్, ఆయన భార్య, స్నేహితుడు శనివారం అర్ధరాత్రి కారులో డైమండ్ పార్కు వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో బైక్‌పై అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు తాము రాజు పంపిన వ్యక్తులమని పరిచయం చేసుకున్నారు.
అనంతరం రమేశ్, ఆయన భార్య, స్నేహితుడిపై దాడి చేసిన దుండగులు వారి వద్ద ఉన్న నగదు, బంగాధితులారాన్ని అపహరించుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రూ.68 లక్షల నగదు, బంగారం అపహరణ
బాధితుల ఫిర్యాదు ప్రకారం.. రమేశ్ బ్యాగులో ఉన్న రూ.18 లక్షలు, ఆయన స్నేహితుడి బ్యాగులో ఉన్న రూ.50 లక్షలు, అలాగే 10 తులాల బంగారాన్ని దుండగులు తీసుకెళ్లారు. దీంతో మొత్తం రూ.68 లక్షల నగదుతో పాటు బంగారం అపహరణకు గురైంది.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఘటనపై బాధితులు ద్వారకానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సమాచారం.

