పాఠశాల విద్యార్థులకు ఇది నిజంగా తీపి కబురే! మధ్యాహ్న భోజన పథకం (Mid-Day Meal Scheme) కింద విద్యార్థులకు వారానికి ఒకసారి ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ వడ్డించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమై, ముఖ్యమంత్రి పరిశీలనకు కూడా వెళ్లడం విశేషం.
అయితే, ఈ సూచన మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే! ఈ క్రేజీ ఐడియా తమిళనాడు ప్రభుత్వం పరిధిలో ఊపందుకుంది.
టీచర్ యూనియన్ల బిగ్ డిమాండ్!
తమిళనాడు అసెంబ్లీలో త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్మోహన్ 80కి పైగా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ భేటీలో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం ముందు పలు కీలక ప్రతిపాదనలు ఉంచాయి:
- చికెన్ బిర్యానీ: విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో పాటు వారానికి ఒకసారి మధ్యాహ్న భోజనంలో చికెన్ బిర్యానీ అందించాలి.
- పథకం విస్తరణ: ప్రస్తుతం ఉన్న ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ మరియు ‘మధ్యాహ్న భోజన పథకాన్ని’ 12వ తరగతి వరకు విస్తరించాలి.
- సిబ్బంది క్రమబద్ధీకరణ: అల్పాహార పథకాన్ని కూడా మధ్యాహ్న భోజన కార్మికులకు అప్పగించి, వారి సేవలను రెగ్యులరైజ్ చేయాలి.
ప్రభుత్వం ఏమంటోంది?
ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ సానుకూలంగా స్పందించారు. ఈ ఫైల్ ఇప్పటికే సీఎం పరిశీలనలో ఉందనట్టు తెలిపారు.
అయితే, ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని సామాజిక సంక్షేమ, మహిళా సాధికారత శాఖ పర్యవేక్షిస్తుండటంతో.. రెండు శాఖలు సంయుక్తంగా చర్చించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
లబ్ధిదారుల వివరాలు:
- అల్పాహార పథకం: 1 నుంచి 8వ తరగతి వరకు సుమారు 32 లక్షల మంది పిల్లలకు వర్తిస్తోంది.
- మధ్యాహ్న భోజనం: 10వ తరగతి వరకు దాదాపు 40 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు.
- 11, 12 తరగతులకు విస్తరిస్తే: మరో 8 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం బడి పిల్లల భోజనం కొత్త రుచులతో కళకళలాడనుంది!
