హర్రర్ ఫాంటసీ తెరకెక్కిన ‘ఆగధ’ మూవీ థియోటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. దైవ చింతనతో జీవించే మహాదేవి (కామాక్షి భాస్కర్ల) తన వద్దకు వచ్చే వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది. అయితే సొంత ఊరికి వచ్చిన ఆమెకు అక్కడ వరుసగా జరుగుతున్న కొన్ని అనూహ్య ఘటనలు కలవరపెడతాయి. గర్భవతిగా ఉన్న మహిమ (ఉల్కా గుప్తా) మృతి చెందడంతో పాటు.. ఆమె కుటుంబ సభ్యుల ప్రవర్తనలోనూ వింత మార్పులు కనిపిస్తాయి.
మరోవైపు మహిమ ప్రియుడు సింహా (శ్రవణ్ రెడ్డి) కూడా అనుమానాస్పదంగా వ్యవహరిస్తుంటాడు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? మహిమ మరణం వెనుక కారణమేంటి? ‘అగధ’ అనే దుష్టశక్తి ఏంటి? దాన్ని మహాదేవి ఎలా ఎదుర్కొందన్నదే సినిమా కథ.
సినిమా ఎలా ఉందంటే?
దేవుడికి, దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటం అనే కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉంది. దర్శకుడు ఎం.ఎస్. రాజు గతంలో తెరకెక్కించిన ‘దేవి’ ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అయితే ఆ సినిమాలో ఉన్నంత బలమైన భావోద్వేగాలు, ఉత్కంఠ ఇందులో కనిపించవు.
ఫస్టాఫ్ మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా సాగుతుంది. కథానాయిక పరిచయం, ఆమె శక్తులను చూపించే సన్నివేశాలు, గుహ నేపథ్యంలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంట్లో సమస్యలు మొదలవడం, ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కథనం బాగానే సాగుతుంది.
కానీ సెకండాఫ్‌లో సినిమా కాస్త నెమ్మదిస్తుంది. ఫస్టాఫ్‌లో రేకెత్తించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆత్మ ద్వారా చెప్పించే ఫ్లాష్‌బ్యాక్ రొటీన్‌గా అనిపిస్తుంది. దుష్టశక్తిని మాటల్లో భయంకరంగా వర్ణించినా.. తెరపై అదే స్థాయిలో భయాన్ని పుట్టించడంలో సినిమా కాస్త వెనుకబడింది.
క్లైమాక్స్ కూడా పెద్దగా ఆశ్చర్యపరచదు. అయితే దర్శకుడు సృష్టించిన మిస్టిక్ ప్రపంచం, విజువల్స్, నిర్మాణ విలువలు సినిమాకు బలంగా నిలిచాయి. చివర్లో కథను పూర్తిగా ముగించకుండా వదిలిన తీరు చూస్తే.. సీక్వెల్‌కు అవకాశం ఉంచినట్లు అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు
మహాదేవిగా కామాక్షి భాస్కర్ల తన పాత్రకు న్యాయం చేసింది. సీరియస్ లుక్‌లో ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా అంతటా ఒకే తరహా హావభావాలు కనిపించడం మైనస్. శ్రవణ్ రెడ్డి విలన్‌గా ఓకే అనిపించాడు. జోవికా విజయ్ కుమార్ తనకు దక్కిన సన్నివేశాల్లో ఆకట్టుకుంది. భానుచందర్, వనితా విజయ్ కుమార్ వంటి సీనియర్ నటులకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఉల్కా గుప్తా తన పాత్ర పరిధిలో బాగానే నటించింది. గురువు పాత్రలో షిజుకు కథను మలుపు తిప్పే మంచి పాత్ర లభించింది.
టెక్నికల్‌గా..
‘అగధ’కు ప్రధాన బలం టెక్నికల్ టీమే. రాకేష్ వెంకటాపురం నేపథ్య సంగీతం హారర్ మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ కూడా ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పంచ్ లైన్
ఓవరాల్‌గా ‘అగధ’.. కొంచెం థ్రిల్.. మిస్టిక్ థ్రిల్లర్!
