ఆస్కార్ 2027లో భారత్ నుంచి రెండు సినిమాలు.. ‘గోంధళ్’, ‘అంగ్’ అసలు ట్విస్ట్ ఇదే

2027లో జరగనున్న 99వ ఆస్కార్ అవార్డుల రేసులో భారత్ నుంచి ఏకంగా రెండు సినిమాలు నిలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే చాలామంది అనుకుంటున్నట్లు రెండు సినిమాలు భారత్ అధికారిక ఎంట్రీలు కావు. ‘గోంధళ్’ అధికారికంగా భారత ఎంట్రీ కాగా, ‘అంగ్’ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గెలిచిన అవార్డు ఆధారంగా మరో మార్గంలో ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించింది.

‘గోంధళ్’కు అధికారిక ఎంట్రీ

దేశవ్యాప్తంగా వచ్చిన 33 చిత్రాలను పరిశీలించిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) జ్యూరీ, దర్శకుడు సంతోష్ దావఖర్ తెరకెక్కించిన మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘గోంధళ్’ను ‘Best International Feature Film’ కేటగిరీకి భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది.

మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యంలో జరిగే ‘గోంధళ్’ అనే జానపద దైవిక పూజ చుట్టూ ప్రేమ, మోసం, హత్యల కుట్రతో సాగే కథాంశం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఆస్కార్ ఎంపికతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది.

‘అంగ్’ ఎలా రేసులోకి వచ్చింది?

నాగాలాండ్‌కు చెందిన దర్శకుడు తేజా రియో రూపొందించిన పీరియడ్ డ్రామా ‘అంగ్’ భారత అధికారిక ఎంపికలో చోటు దక్కించుకోలేదు. కారణం థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించిన సాంకేతిక అర్హతలు.

అయితే ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో అత్యున్నత Platform Prize గెలుచుకుంది. అకాడమీ కొత్త నిబంధనల ప్రకారం, ఎంపిక చేసిన అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రధాన అవార్డు గెలిచిన చిత్రాలు తమ దేశ అధికారిక ఎంట్రీతో సంబంధం లేకుండా ఆస్కార్ పరిశీలనకు అర్హత పొందుతాయి. అదే మార్గంలో ‘అంగ్’ కూడా 2027 ఆస్కార్ రేసులోకి ప్రవేశించింది

నామినేషన్ వచ్చిందా?

లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆస్కార్ రేసులో అర్హత సాధించడం అంటే నామినేషన్ ఖరారైనట్లు కాదు. ఇప్పుడు ‘గోంధళ్’, ‘అంగ్’ రెండూ అకాడమీ పరిశీలనలోకి వెళ్తాయి. ఆ తర్వాత షార్ట్‌లిస్ట్, చివరకు అధికారిక నామినేషన్ల దశ ఉంటుంది.

2027 ఆస్కార్ వేడుకల్లో ఈ రెండు చిత్రాలు తదుపరి దశలను దాటితే, భారతీయ సినిమాకు అది అరుదైన అంతర్జాతీయ గౌరవంగా నిలుస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *