బ్రిటన్‌లో లైంగిక వేధింపుల ముఠాల (Grooming Gangs) దారుణాలపై అక్కడి చట్టసభలో మరోసారి తీవ్ర చర్చ జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో చిన్నారులు, మహిళలపై జరిగిన లైంగిక దోపిడీ ఘటనలకు సంబంధించిన స్వతంత్ర దర్యాప్తు నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యవస్థీకృతంగా పనిచేసిన ఈ ముఠాల అత్యాచారాలు, వేధింపులు, అలాగే పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను పలువురు చట్టసభ సభ్యులు సభలో ప్రస్తావించారు. ఈ దారుణాలకు పాల్పడిన వారిలో ఎక్కువమంది పాకిస్థాన్‌ మూలాలున్న ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులేనని గతంలోనే తేలిన విషయం తెలిసిందే.

బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు రూపెల్ట్‌ లోవ్ మాట్లాడుతూ.. “లైంగిక దాడులకు గురైన వారిలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఓ బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడులు జరిగాయని తెలిపింది. మూడేళ్ల కాలంలో తనపై 600 నుంచి 700 మంది అత్యాచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరో మహిళ తన ప్రైవేటు భాగాలను తీవ్రంగా గాయపరిచారని పేర్కొంది. బాధితులను జంతువుల్లా చూసినట్లు అనేక మంది వాంగ్మూలం ఇచ్చారు. శ్వేతజాతీయ మహిళలనే లక్ష్యంగా చేసుకొని ఈ ముఠాలు లైంగిక హింసకు పాల్పడ్డాయని పలువురు ఆరోపించారు. కొందరు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపైనా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయని వెల్లడించారు. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని చట్టసభ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

బ్రిటన్‌లో లైంగిక వేధింపుల ముఠాల వ్యవహారం తొలిసారిగా 2002లో వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌ మూలాలున్న కొందరు వ్యక్తులు దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2010లో సౌత్‌ యార్క్‌షైర్‌లో కొందరు మైనర్‌ బాలికలను వేధించిన కేసులో పాక్‌ మూలాలున్న ఐదుగురు దోషులుగా తేలడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తదనంతరం రోచ్‌డేల్‌, రోథర్‌హ్యామ్‌, ఓల్డ్‌హ్యామ్‌, టెల్ఫోర్డ్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన దర్యాప్తుల్లో ఈ వ్యవస్థీకృత ముఠాల దారుణాలు వెలుగుచూశాయి. అయితే, అనేక కేసుల్లో పోలీసుల పాత్రపైనా ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదులను అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని, సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *