బెంగాల్ క్రికెటర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు సహా పలు తీవ్ర ఆరోపణలు ఈ కేసులో నమోదైనట్లు సమాచారం.
హుగ్లీ రూరల్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమామి సిటీలో పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత జూన్‌లో ఓ వైద్య విద్యార్థిని ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ఫిర్యాదులో..
తనకు, అభిషేక్ పోరెల్‌కు గత మూడేళ్లుగా సంబంధం ఉందని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. గత ఏడాది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని.. ఆ తర్వాత పోరెల్ తనకు దూరంగా ఉండటం ప్రారంభించాడని ఆమె ఆరోపించింది. తనను వివాహం చేసుకుంటానని పోరెల్ హామీ ఇచ్చాడని, అయితే ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. వివాహం చేసుకుంటానన్న హామీతో తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అనంతరం దాడి చేసి బెదిరించాడని కూడా ఆమె ఆరోపించినట్లు సమాచారం.
అరెస్ట్‌కు కలకత్తా హైకోర్టు ఆదేశాలు
ఈ కేసులో అభిషేక్ పోరెల్‌ను అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆరోపణలను పోరెల్ గతంలోనే ఖండించినట్లు సమాచారం. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఎవరీ అభిషేక్ పోరెల్?
ఎడమచేతి వాటం కలిగిన టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన అభిషేక్ పోరెల్.. 2023 నుంచి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 108 పరుగులు చేశాడు. 2021-22 సీజన్‌లో బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పోరెల్.. ఇప్పటివరకు 32 ఫస్ట్ క్లాస్, 23 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. గతంలో భారత్-ఏ జట్టుతో కలిసి యూకే, ఆస్ట్రేలియా పర్యటనలకు కూడా వెళ్లాడు.
