సౌర కుటుంబంలోని మరుగుజ్జు గ్రహం ప్లూటో మరోసారి శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. నాసా (NASA) చేపట్టిన తాజా అధ్యయనంలో ప్లూటో ఉపరితలంపై ద్రవరూప నైట్రోజన్ (Liquid Nitrogen) ఇటీవల ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ప్లూటోపై ఇటీవల కాలంలో ద్రవం ప్రవహించినట్లు లభించిన తొలి ఆధారాలు ఇవేనని పరిశోధకులు వెల్లడించారు.

ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ‘ది ప్లానెటరీ సైన్స్ జర్నల్’లో జూలై 31న ప్రచురితమయ్యాయి. 2015లో నాసా ‘న్యూ హొరైజన్స్ (New Horizons)’ వ్యోమనౌక ప్లూటో సమీపంగా ప్రయాణించిన సమయంలో సేకరించిన చిత్రాలను మళ్లీ విశ్లేషించగా ఈ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్లూటోలోని గుండె ఆకారంలో కనిపించే భారీ మంచు ప్రాంతమైన ‘స్పుట్నిక్ ప్లానిటియా (Sputnik Planitia)’ ఉత్తర అంచుల్లో ఉన్న పగుళ్ల నుంచి ద్రవరూప నైట్రోజన్ పైకి వచ్చినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాంతం టెక్సాస్, ఓక్లహోమా రాష్ట్రాల కలిపిన విస్తీర్ణం కంటే కూడా పెద్దదిగా ఉండటం విశేషం.

పరిశోధకుల ప్రకారం, ఈ ప్రాంతంలోని కొన్ని నల్లటి గీతలు, మచ్చలు భూమిపై మంచు ప్రాంతాల్లో వర్షం లేదా భూగర్భం నుంచి పైకి వచ్చిన ద్రవాల వల్ల ఏర్పడే ఆకృతులను పోలి ఉన్నాయి. అయితే ప్లూటోలో వాతావరణ పరిస్థితుల కారణంగా ద్రవరూప నైట్రోజన్ వర్షం కురవడం అసాధ్యమని, అందువల్ల భూగర్భం నుంచి నైట్రోజన్ పైకి వచ్చిన అవకాశమే ఎక్కువగా ఉందని వారు పేర్కొన్నారు.

న్యూ హొరైజన్స్ మిషన్ ప్రధాన పరిశోధకుడు అలన్ స్టెర్న్ మాట్లాడుతూ.. “ప్లూటో ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ కొత్త ఆధారాలు ప్లూటోలో ఇప్పటికీ భౌగోళిక మార్పులు కొనసాగుతున్నాయని సూచిస్తున్నాయి” అని తెలిపారు

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *