పోస్టాఫీస్ వినియోగదారులకు ఇండియా పోస్ట్ కీలక ప్రకటన చేసింది. స్పీడ్ పోస్ట్ సేవలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూ, ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. సాధారణ రిటైల్ వినియోగదారుల ఛార్జీల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, బల్క్ కస్టమర్ల కోసం కొత్త టారిఫ్‌ను అమలు చేయనుంది. అలాగే ఏవీ డాక్యుమెంట్స్, ఏవీ పార్శిల్స్ కిందకు వస్తాయనే అంశంపై కూడా స్పష్టత ఇచ్చింది.
కొత్త నిబంధనల ప్రకారం వాణిజ్య విలువ లేని వస్తువులను డాక్యుమెంట్లుగా పరిగణిస్తారు. ఉత్తరాలు, ముద్రిత పత్రాలు, అధికారిక డాక్యుమెంట్లు, వెల్కమ్ కిట్లు, పాస్‌బుక్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకులు పంపే ఇతర సమాచార పత్రాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలను కూడా డాక్యుమెంట్లుగానే పరిగణిస్తారు.
అలాగే 500 గ్రాముల వరకు బరువున్న, వాణిజ్య విలువ లేని ఎన్వలప్‌లు లేదా ప్యాకెట్లను కూడా డాక్యుమెంట్స్ కేటగిరీలో పంపవచ్చని ఇండియా పోస్ట్ తెలిపింది. గ్రీటింగ్ కార్డులు, రాఖీ ఎన్వలప్‌లు, వ్యక్తిగత ఉత్తర ప్రత్యుత్తరాలు వంటి వాణిజ్యేతర వస్తువులు కూడా ఈ జాబితాలో ఉంటాయి.
ఇకపై అమ్మకానికి ఉద్దేశించిన వస్తువులు, వాణిజ్య విలువ కలిగిన ఉత్పత్తులు లేదా సరుకులన్నింటినీ పార్శిల్స్‌గా పరిగణిస్తామని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది. దీంతో పంపే వస్తువు స్వభావాన్ని బట్టి సరైన కేటగిరీలో బుక్ చేయాల్సి ఉంటుంది.
రిటైల్ వినియోగదారులకు ప్రస్తుతం అమల్లో ఉన్న స్పీడ్ పోస్ట్ ఛార్జీల్లో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త 24 గంటల స్పీడ్ పోస్ట్ సేవలో 50 గ్రాముల వరకు బరువున్న డాక్యుమెంట్లను స్థానికంగా పంపేందుకు రూ.38, దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపేందుకు రూ.94 (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. బరువు, గమ్యస్థానాన్ని బట్టి ఛార్జీలు పెరుగుతాయి. 51 నుంచి 250 గ్రాముల వరకు ఉన్న డాక్యుమెంట్లకు రూ.118 నుంచి రూ.154 వరకు, 251 నుంచి 500 గ్రాముల వరకు ఉన్న వాటికి రూ.140 నుంచి రూ.186 వరకు ఛార్జీలు ఉంటాయి.
అధిక పరిమాణంలో మెయిల్ పంపే సంస్థల కోసం ఇండియా పోస్ట్ ప్రత్యేక బల్క్ టారిఫ్‌ను ప్రకటించింది. 24 గంటల స్పీడ్ పోస్ట్ సేవను వినియోగించే బల్క్ కస్టమర్లు కేటగిరీ, గమ్యస్థానాన్ని బట్టి రూ.38 నుంచి రూ.100 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవకు బల్క్ కస్టమర్ల నుంచి రూ.48 నుంచి రూ.72 వరకు వసూలు చేస్తారు. అదే రిటైల్ వినియోగదారులు 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవను ఉపయోగిస్తే, బరువు మరియు డెలివరీ ప్రాంతాన్ని బట్టి రూ.61 నుంచి రూ.121 వరకు ఛార్జీలు వర్తిస్తాయి.
కొత్త మార్గదర్శకాలతో డాక్యుమెంట్లు, పార్శిల్స్ వర్గీకరణలో స్పష్టత రావడంతో వినియోగదారులు అనవసరంగా అధిక ఛార్జీలు చెల్లించే పరిస్థితి తగ్గుతుందని ఇండియా పోస్ట్ పేర్కొంది.
