టీమిండియా(Team India) యువ స్పిన్నర్ మానవ్ సుతార్(Manav Sutar) తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. న్యూ చండీగఢ్ వేదికగా అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో జరుగుతున్న ఏకైక టెస్టులో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆరు వికెట్లు పడగొట్టి రికార్డుల పుస్తకాల్లో చోటు సంపాదించాడు.

ఎడమచేతి స్పిన్నర్ అయిన సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఇందులో 10 మెయిడెన్ ఓవర్లు ఉండటం విశేషం. అతని అద్భుత బౌలింగ్ ధాటికి అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైంది.

తొలి టెస్టులోనే ఐదు వికెట్ల ఘనత


అఫ్గానిస్థాన్‌పై ఫాలోఆన్ అమలు చేసిన భారత్‌కు సుతార్ కీలక ఆయుధంగా మారాడు. ఈ ప్రదర్శనతో 21వ శతాబ్దంలో తన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనే ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు.
తన బౌలింగ్‌లో అద్భుతమైన టర్న్, డ్రిఫ్ట్‌తో అఫ్గాన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన సుతార్ మ్యాచ్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు.

రెండో రోజు నుంచే మాయాజాలం


మ్యాచ్ రెండో రోజు సుతార్ మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అబ్దుల్ మాలిక్ (16), రహ్మానుల్లా గుర్బాజ్ (12), అఫ్సర్ జజాయ్ (3)లను తన స్పిన్ మాయతో పెవిలియన్‌కు పంపించాడు.
మూడో రోజు ఉదయం కూడా అదే జోరు కొనసాగించిన అతడు షరాఫుద్దీన్ అష్రఫ్ (11), రహ్మత్ షా (60), మొహమ్మద్ సలీమ్ సఫీ (0) వికెట్లు తీసి అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.

భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత


మానవ్ సుతార్ ఇప్పుడు టెస్టు అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన 10వ భారత బౌలర్‌గా నిలిచాడు. స్పిన్నర్లలో ఈ ఫీట్ సాధించిన ఏడో భారత స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా, టెస్టు అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో 1988లో వెస్టిండీస్‌పై 8/61 గణాంకాలు నమోదు చేసిన నరేంద్ర హిర్వానీ అగ్రస్థానంలో ఉన్నారు.


23 ఏళ్ల రాజస్థాన్ స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి మ్యాచ్‌లోనే ఇలాంటి ప్రదర్శన చేయడంతో భారత జట్టుకు భవిష్యత్తులో మరో ప్రతిభావంతమైన స్పిన్నర్ దొరికినట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *