ఫిఫా ప్రపంచకప్(FIFA World Cup) 2026లో అత్యంత ఆకర్షణీయ ఆటగాళ్లలో బ్రెజిల్ స్టార్ నెయ్‌మర్(Neymar) ఒకరు. అతడి ఆటను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే వరల్డ్‌కప్‌లో బ్రెజిల్(Brazil) ఆడనున్న తొలి మ్యాచ్‌కు నెయ్‌మర్ దూరం కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్ జట్టు ఆదివారం వేకువజామున 3.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మొరాకోతో తలపడనుంది. అయితే జట్టులో కీలక ఆటగాడైన 34 ఏళ్ల నెయ్‌మర్ లేకపోవడం బ్రెజిల్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అతడు లేకుండా తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ ఎలా రాణిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గ్రూప్ స్టేజ్ మొత్తం మిస్ అయ్యే ప్రమాదం
పిక్క (కాఫ్) గాయం కారణంగా నెయ్‌మర్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని బ్రెజిల్ ప్రధాన కోచ్ కార్లో యాన్సెలొట్టి వెల్లడించారు. అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఫిఫా వర్గాలు చెబుతున్నాయి. దీంతో నెయ్‌మర్ గ్రూప్ స్టేజ్‌లోని అన్ని మ్యాచులకు దూరమయ్యే ప్రమాదం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి.
అలా జరిగితే ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌కు ఇది భారీ దెబ్బగా మారే అవకాశం ఉంది. గ్రూప్ Fలో ఉన్న బ్రెజిల్ జూన్ 19న హైతీతో, జూన్ 24న స్కాట్లాండ్‌తో తలపడనుంది. అప్పటికి నెయ్‌మర్ కోలుకుని జట్టులోకి వస్తాడా లేదా అన్న దానిపై కూడా స్పష్టత లేదు. అతడు తిరిగి ఎప్పుడు బరిలోకి దిగుతాడనే విషయంపై కోచ్ కూడా హామీ ఇవ్వలేకపోయారు.
ఈ సందర్భంగా కార్లో యాన్సెలొట్టి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ఫిట్‌నెస్ సాధించేందుకు నెయ్‌మర్ కృషి చేస్తున్నాడు. వచ్చే వారం నాటికి కోలుకుని జట్టుకు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం. జట్టులోని యువ ఆటగాళ్లకు అతడు గొప్ప స్ఫూర్తి. ఆరో ప్రపంచకప్ టైటిల్ సాధించాలన్న బ్రెజిల్ కలను నెరవేర్చడంలో నెయ్‌మర్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే అతడు లేకుండా ఎలా ఆడాలనే దానిపై కూడా మేం సన్నద్ధమయ్యాం. నెయ్‌మర్ లేకపోయినా మా ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు.
