Rain Alert: తెలంగాణకు మరో రెండు రోజులు భారీ వర్ష ముప్పు: పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ!

 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో స్థిరపడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వాయుగుండం రాబోయే గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నందున వర్షపాత తీవ్రతను బట్టి వివిధ జిల్లాలకు వేర్వేరు అలర్ట్‌లను అధికారులు ప్రకటించారు.

ఉత్తర తెలంగాణ పరిధిలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు రాజధాని హైదరాబాద్ సహా మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే వీలుండటంతో ఎల్లో అలర్ట్ విధించారు.

గత నాలుగు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో 30 శాతం మేర వర్షపాత లోటు ఉండగా, గత రెండు రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల ధాటికి సాధారణ వర్షపాతానికి చేరుకున్నామని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ వర్షాలు ఖరీఫ్ పంటలకు ఎంతగానో మేలు చేస్తాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో సహా పట్టణ ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *