భారత జట్టు యువ ఓపెనర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) వన్డే క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. అఫ్గానిస్థాన్‌తో ధర్మశాలలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో గిల్ 3,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచులో గిల్ 84 పరుగులు చేసి సత్తా చాటాడు ఈ ఘనతను అతడు కేవలం 62 మ్యాచ్‌లు, 62 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకోవడం విశేషం.

ఆమ్లా తర్వాత గిల్‌దే రెండో స్థానం


వన్డేల్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ల జాబితాలో గిల్ ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచాడు. ఈ రికార్డులో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బ్యాటర్హషీమ్ ఆమ్లా (Hashim Amla) 57 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. గిల్ (62 ఇన్నింగ్స్‌లు) వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (Shai Hope), పాకిస్థాన్ ఆటగాళ్లు ఫఖర్ జమాన్ (Fakhar Zaman), ఇమామ్-ఉల్-హక్ (Imam-ul-Haq) (67 ఇన్నింగ్స్‌లు)లను వెనక్కి నెట్టాడు. భారత ఆటగాళ్లలో ఈ రికార్డు ఇంతకుముందు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) పేరిట ఉండేది. ధావన్ 72 ఇన్నింగ్స్‌ల్లో 3,000 పరుగులు పూర్తి చేశాడు.

కోహ్లీ తర్వాత అత్యుత్తమ సగటు


3,000కు పైగా వన్డే పరుగులు చేసిన బ్యాటర్లలో గిల్ సగటు 55కు పైగా ఉండగా, అతని కంటే మెరుగైన సగటు కేవలం విరాట్ కోహ్లీ (Virat Kohli) (58.71)కి మాత్రమే ఉంది. గిల్ స్ట్రైక్‌రేట్ కూడా 99కు పైగానే ఉండటం అతని దూకుడు ఆటకు నిదర్శనం. ఇప్పటివరకు అతడు వన్డేల్లో 25 సార్లు 50కు పైగా స్కోర్లు నమోదు చేశాడు. వీటిలో 8 సెంచరీలన్నాయి. అంతేకాకుండా ఒక డబుల్ సెంచరీ కూడా అతని ఖాతాలో ఉంది. ఇప్పటికే వన్డేల్లో 2,000 పరుగులను అత్యంత వేగంగా (38 ఇన్నింగ్స్‌ల్లో) పూర్తి చేసిన బ్యాటర్‌గా కూడా గిల్ రికార్డు సృష్టించాడు.

స్వదేశంలో అద్భుత ప్రదర్శన


భారత్‌లో ఆడిన 30 వన్డేల్లో గిల్ 1,670కుపైగా పరుగులు సాధించాడు. అతని సగటు 60కు పైగా ఉండగా, ఇందులో 5 సెంచరీలు, 10 అర్ధసెంచరీలున్నాయి. విదేశాల్లో ఆడిన 29 వన్డేల్లో 879 పరుగులు చేసి 46.26 సగటును నమోదు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలన్నాయి. తటస్థ వేదికలపై కూడా గిల్ అద్భుతంగా రాణించాడు. అలాంటి మ్యాచ్‌ల్లో 644 పరుగులు చేసి 63.42 సగటు నమోదు చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో సహా నాలుగు 50+ స్కోర్లు ఉన్నాయి.

భవిష్యత్‌కు భారత క్రికెట్ ఆశాకిరణం


తక్కువ కాలంలోనే వరుస రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్న శుభ్‌మన్ గిల్, భారత వన్డే జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. అతని స్థిరమైన ప్రదర్శన, భారీ స్కోర్లు సాధించే సామర్థ్యం భవిష్యత్‌లో మరిన్ని అరుదైన రికార్డులకు దారి తీసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *