మన దేశంలోనూ త్వరలో ఎగిరే కార్లు అందుబాటులోకి రానున్నాయి. జపాన్‌కు చెందిన ఫ్లైయింగ్‌ కార్ల తయారీ సంస్థ ‘స్కైడ్రైవ్‌ ఇంక్‌’ 2028 నాటికి భారత్‌లో తమ ఈవీటీఓఎల్‌ (eVTOL) వాహనాలను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత వీటిని ప్రయాణికుల కోసం కాకుండా ‘మెడికల్‌ లాజిస్టిక్స్‌’‌లో ఉపయోగించనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ తొమొహిరో వెల్లడించారు.

అవయవ మార్పిడి సమయంలో అవయవాలను వేగంగా ఆసుపత్రులకు చేర్చడం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో భారత్‌లో తమ eVTOL వాహనాలను ఉపయోగించేందుకు ‘ఎయిర్‌ ఇండియా, సుజుకీతో’ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.

అసలు ఈ ఎగిరే కార్లు ఎలా పనిచేస్తాయి?

eVTOL వాహనాలు రన్‌వే అవసరం లేకుండా నిలువుగా టేకాఫ్‌, ల్యాండింగ్‌ చేయగల చిన్న విద్యుత్‌ ఆధారిత విమానాలు. వీటిపై ఇప్పటికే పలు పరీక్షలు నిర్వహించినట్లు స్కైడ్రైవ్‌ తెలిపింది. ఈ వాహనాలు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని, ఇప్పటివరకు 300కు పైగా విజయవంతమైన ప్రయాణ పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఇవి సర్టిఫికేషన్‌ దశలో ఉన్నాయి. జపాన్‌తో పాటు భారత్‌లోనూ మరో రెండేళ్లలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది.

భారత్‌లోనే తయారీ.. భారీ ప్లాన్!

జపాన్‌లో ఎగిరే కార్ల తయారీ కోసం సుజుకీతో స్కైడ్రైవ్‌ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్‌లో భా‘రత్‌లోనూ eVTOL వాహనాలను తయారు చేసి.. పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే స్కైడ్రైవ్‌ ఎగిరే కార్లకు ‘450 ప్రీఆర్డర్లు’ వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో 50 ప్రీఆర్డర్లు భారత్‌ నుంచే ఉన్నాయని తెలిపింది. తొలుత వైద్య అవసరాలకు ఈ ఎగిరే వాహనాలను వినియోగించి.. ఆ తర్వాత ప్రయాణికులను తరలించే ఎయిర్‌ ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని స్కైడ్రైవ్‌ భావిస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *